అది రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్, పెయిడ్ ఆర్టిస్టుల పాద యాత్ర!

శుక్రవారం, 26 నవంబరు 2021 (17:51 IST)
శ్రీబాగ్ ఒప్పందం అమలు కోసం అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాలను ముట్టడి చేస్తామని రాయలసీమ విద్యార్థి, యువజన  సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు. శ్రీ బాగ్ ఒప్పందం కట్టుబడి ఉండకుండా రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, అమరావతి పెయిడ్ ఆర్టిస్టు రైతుల రియల్ ఎస్టేట్ వ్యాపారుల న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రను రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామన్నారు. అవసరమైతే రాయలసీమ నుంచి వాళ్లను తరిమి కొడతామని రాయలసీమ విద్యార్థి, యువజన  సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు. 
 
 
శుక్రవారం కర్నూలులోని మాంటిశ్వరి పాఠశాలలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై,  రాజకీయ పార్టీల నేతల ద్వంద్వ  వైఖరిపై చర్చించి భవిష్యత్  కార్యచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు సునీల్ రెడ్డి, శ్రీ రాములు రామకృష్ణ, రవికుమార్, జూనియర్ న్యాయవాది రామాంజనేయులు, రాజునాయుడు, రామచంద్రుడు, ఓబులేసు, మహేంద్ర, నరసన్న,ముక్తార్, ఎద్దు పెంట అంజి, వెంకీ, రామ రాజు, సురేష్, రియాజ్, శివ నాగరాజు, సూర్య ప్రకాష్, వెంకట్  శివ కృష్ణ యాదవ్, జయరాజు, శేఖర్ తదితర నేతలు హాజరై మాట్లాడారు. 
 
 
రాయలసీమలో పుట్టి రాయలసీమలో పెరిగి రాయలసీమ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై అమరావతి జపం చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. అమరావతి పెయిడ్ ఆర్టిస్ట్ లకు సీమ నేతలు చందాలు ఇవ్వడం చాలా సిగ్గుచేట‌ని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాయలసీమలో రాజధాని కోసం ఉద్యమం చేయాలని అన్నారు. శ్రీ బాగ్ ఒప్పందం అమలు కాకుండా అమరావతిలోనే రాజధాని అంటే రాయలసీమవాసులుగా ఒప్పుకోమని అన్నారు. రాయలసీమ ప్రజలు ఆంధ్రలో భాగం కాదా అని  ప్రశ్నించారు. అమరావతి పెయిడ్ ఆర్టిస్టు రైతుల, స్టేట్ రైతుల న్యాయస్థానం టు దేవస్థానం  పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. 
 
 
అదే విధంగా కర్నూలులో కేంద్ర న్యాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని, వేదవతి ఆర్డీఎస్ కుడి కాలువ తుంగభద్ర సమాంతర కాలువ గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి,  సిద్దేశ్వరం అలుగు నిర్మించాలి, రాయలసీమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల నిధులు విడుదల చేయాలి, రాయలసీమ జిల్లాలను కలుపుతూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలి, పరిశ్రమలునెలకొల్పేందుకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి, రాయలసీమ రేజ్మెంట్  ఏర్పాటు చేయాలి. జీవో నెంబర్ 69 రద్దు చేయాల‌ని డిమాండు చేశారు. 
 
 
శ్రీశైలం ప్రాజెక్టు ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన రైతు కుటుంబాలకు జీవో నెంబర్ 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల‌ని ఈ సమావేశంలో తీర్మానం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు