త్వరలో తిరుమల ఘాట్‌ రోడ్లపైకి ఎలక్ట్రికల్‌ బస్సులు

శనివారం, 30 అక్టోబరు 2021 (12:40 IST)
పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా తిరుమల ఘాట్‌రోడ్లపై త్వరలో ఎలక్ర్టికల్‌ బస్సులు పరుగులు తీయనున్నాయి. తిరుపతి, తిరుమల అర్బన్‌ పరిధిలో మొత్తం 100 ఈ- బస్సులు, తిరుపతి- తిరుమల మార్గంలో మరో 50 ఎలక్ర్టికల్‌ బస్సులు నడిపేందుకు రంగం సిద్ధమైంది.

వీటితో పాటు తిరుపతి సమీప ప్రాంతాలైన కడప, నెల్లూరు, మదనపల్లి, చిత్తూరు, రేణిగుంట నుంచి మరో 50 ఈ- బస్సులు తిరుమలకు తిరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఎలక్ర్టికల్‌ బస్సులను రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ చకాచకా ఏర్పాట్లు చేస్తోంది.

పవిత్ర శ్రీవారి క్షేత్రంలో పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టి, భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఎలక్ర్టికల్‌ బస్సులు ఏర్పాటుకానున్నాయి. ఇందుకుగాను ప్రభుత్వం  ప్రైవేటు ట్రాన్స్‌పోర్టర్ల నుంచి బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోనుంది.

ఎలక్ర్టికల్‌ బస్సులు నడపడంపై ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నా పలు కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ బస్సులు రోడ్డెక్కేందుకు మార్గం సుగమమైంది. తిరుపతి- తిరుమల తరహాలోనే తదుపరి దశలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలో కూడా ఈ బస్సులు నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు