విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని పర్యావరణ ఉద్యమకారిణి మేధా పాట్కర్ అన్నారు. శనివారం స్ట్రీల్ ప్లాంటు ప్రవేటీకరణ వ్యతిరేకంగా కూర్శన్నపాలెం దగ్గర కార్మికులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్, ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ సంఘీభావం పలికారు.
ఈ సందర్భంగా మేధాపాట్కర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వరంగ సంస్థల ప్రవేటీకరణతో దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశాన్ని ప్రజలే నిర్మించుకున్నారని, ఇందులో నేతలు, పార్టీల ప్రమేయం లేదని చెప్పారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజలు, కార్మికులు, రైతులు ఉద్యమం చేసే సమయం ఆసన్నమైందని మేధాపాట్కర్ తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మనీయ కూడదని, మోదీ సర్కారుకు ఈ విశాఖ స్టీల్స్ సాక్షిగా బుద్ధి చెప్పాలని సూచించారు. కార్మికుల ఉద్యామానికి తాము పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్, ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ తెలిపారు.