విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కట్టుబడివున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టుకు కూడా ఓ అఫిడవిట్ సమర్పించింది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెల్సిందే. దీనిపై కేంద్ర సర్కారు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఇందులో ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వివరించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, స్టీల్‌ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్‌లో చెప్పింది. దీంతో కేంద్ర సర్కారు దాఖలు చేసిన అఫిడివిట్‌పై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్టీల్‌ప్లాంట్‌లో గురువారం ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉద్యోగస్తులు పరిపాలన భవనం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విధులకు వెళుతున్న ఇతర కార్మికులను ఉద్యోగస్తులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ పోలీసులను భారీ సంఖ్యలో మొహరించి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలపై స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.