జగన్ నుంచి మాంగ్రూవ్ ఫారెస్ట్‌ను కాపాడండి : చంద్రబాబు

మంగళవారం, 12 మే 2020 (13:03 IST)
తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ మడ అడువుల నరికివేతపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి ఈ అడవులను రక్షించాలంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
ఇళ్ల స్థలాల కోసం కాకినాడలోని మడ అడవులను వైకాపా ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా నరికివేస్తోంది. దీనిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఆ అడవులు ఎలా ఉండేవో, నరికివేతతో అక్కడి ప్రాంతం ఎలా మారిపోయిందో తెలుపుతున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. 
 
"ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించిన కోరింగ మడ అడవులను వైసీపీ ప్రభుత్వం ఎలా నరికేసి, మట్టి నింపేస్తుందో చూడండి. కాకినాడకు రక్షణ కవచం వంటి మడ అడవులను ఇలా నరికేస్తే రేపు తుఫానులొచ్చినప్పుడు ప్రజల సంగతి ఏంటీ? ఇలాంటి చోట ఇళ్లు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఏంటి?" అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మడ అడవులను జగన్‌ నుంచి కాపాడాలంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు.

క్షమించరాని నేరం... 
అలాగే, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఓ ట్వీట్ చేశారు. మడ అడవులను నరికివేయిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
'వైసీపీ కాంట్రాక్టర్లు ఇలా అడవులు నరకేయడం సరికాదు. సముద్ర జీవులకు కూడా ఆ అడవులు ముఖ్యం. తుపానులు వచ్చినా మడ అడవులు కాపాడుతాయి. సముద్రపు ఒడ్డున పరిస్థితులను నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడతాయి. సముద్రపు జీవుల నివాసానికి కూడా మడ అడవుల చెట్లు అవసరం' అని చెప్పారు.
 
'సముద్ర నీళ్లను గ్రామాల్లోకి రాకుండా మడ అడవులు కాపాడతాయి. ఉప్పు నీటిలో చాలా శాతాన్ని కూడా మడ చెట్లు పీల్చుకుంటాయి. వాతావరణ సమతుల్యానికి అవి ముఖ్యం. మడ చెట్లు నరుకుతుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే స్వయంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతుండడం సరికాదు' అని ఆయన వ్యాఖ్యానించారు. 'జీవ వైవిధ్యంలో కీలకపాత్ర పోషించే మడ అడవులను నరికేయడం క్షమించరాని నేరం జగన్‌గారు' అని ఆయన ట్వీట్ చేశారు.

 

ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించిన కోరింగ మడ అడవులను వైసీపీ ప్రభుత్వం ఎలా నరికేసి, మట్టి నింపేస్తుందో చూడండి. కాకినాడకు రక్షణ కవచం లాంటి మడ అడవులను ఇలా నరికేస్తే రేపు తుఫానులొచ్చినప్పుడు ప్రజల సంగతి ఏంటి? ఇలాంటి చోట ఇళ్ళు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఏంటి?#SaveMadaForestFromJagan pic.twitter.com/ufJvJSHqZC

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) May 12, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు