భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాటల తూటాలు పేల్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, కేంద్రం నిధులను ఉపయోగించుకోవడం లేదంటూ తెలంగాణ రాష్ట్ర పర్యటనలో అమిత్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నన్ను ఎన్ని తిట్టినా పడతా.. తెలంగాణనంటే ఊర్కోను అని కేసీఆర్ హెచ్చరించారు. అలాగే, కేంద్రం డబ్బుతో రాష్ట్రం నడుస్తోందా? మా డబ్బుతో కేంద్రం నడుస్తోందా! అంటూ నిలదీశారు. కేంద్రానికి 2016-17లో మేమిచ్చింది రూ.50 వేల కోట్లు.. మాకు కేంద్రం ఇచ్చింది రూ.24.5 వేల కోట్లు. అలాగే, గత మూడేళ్లలో మాకిచ్చింది రూ.67,390 కోట్లు అని కేసీఆర్ వివరించారు.
ఇకపోతే అమిత్ షా తన పర్యటనలో నిర్వహించిన దళితులతో సహపంక్తి భోజనాలను సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. "నీవెక్కడో మామిడి తోటలో వంటలు వండించుకొని... దళితవాడకు పోయి, టేబుళ్లు వేసుకొని ఆరగించి పేపర్‌లో ఫొటోలేయించుకుంటే తాము చక్కరొచ్చి పడిపోవాలా" అని ఎద్దేవా చేశారు. ఈ గిమ్మిక్కులు, డ్రామాలు తమకు తెలియవా? అని నిలదీశారు. 'దళితవాడల్లో సహపంక్తి భోజనం కింద కూర్చొని తినకుండా టేబుళ్లు వేసుకొని తింటావా? మీ అసలు స్వరూపమేంది! మీరు మాట్లాడడమేంది!? పెద్ద దేవులపల్లికి అన్నపూర్ణ మెస్ నుంచి భోజనం పోయింది. అమిత్ షా..! నీవు మూడు దళితవాడల్లో తిన్నట్లు నటించావు. నీవు తిన్న భోజనం దళితవాడల్లో వండలేదు. తేరాట్‌పల్లి కమ్మగూడెంలో మనోహర్ రెడ్డి వండించి పంపించాడు. ఇదంతా ఫేస్‌బుక్‌లో మోపయింది. ఇవాళ దళిత నాయకుడి ఇంట్లో వండించారు. గిమ్మిక్కులతో తెలంగాణలో రాజకీయం చేస్తా అంటే నడవదు' అని స్పష్టం చేశారు.
అలాగే, 'హైకోర్టు విభజన జరిగితేనే రాష్ట్ర విభజన జరిగినట్లు. మూడేళ్లుగా కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను కూడా కలిసినం. న్యాయవాదులు హైకోర్టు విభజన కోరితే కేసులు పెట్టారు' అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. హైకోర్టు విభజన జరగలేదని విలేకరులు అడిగితే, హైదరాబాద్‌లో హైకోర్టు ఉందంటూ కుళ్లు జోకు వేశారని, హైకోర్టు హైదరాబాద్‌లో ఉందని చెప్పడానికి అమిత్ షా ఢిల్లీ నుంచి రావాలా అని మండిపడ్డారు. ‘‘మేం హౌలాగాళ్లమా.. మాకు తెల్వదా?’’ అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలపై ఇది క్రూర పరిహాసమని, నువ్వు చేయాల్సిన డ్యూటీ చేయకుండా ఈ విధంగా ప్రజలను కించపరుస్తావా? అంటూ అమిత్ షాపై కేసీఆర్ మండిపడ్డారు.