దొడ్డిదారిన పదవులు దక్కించుకోలేదు... నా సొంత డబ్బులే ఖర్చు చేస్తా : వైవీ సుబ్బారెడ్డి

బుధవారం, 17 జులై 2019 (17:43 IST)
మాజీ మంత్రి నారా లోకేశ్‌పై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాను దొడ్డిదారిన పదవిలోకి రాలేదన్నారు. దేవుడి సొమ్మును ఒక్క పైసా కూడా ముట్టుకోనని, అవసరమైతే తన డబ్బే ఖర్చు చేస్తానంటూ ప్రకటించారు. 
 
అమరావతిలో తితిదే ఛైర్మన్‌కు క్యాంపు కార్యాలయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై పెద్ద వివాదమే చెలరేగింది. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ, దేవుడు సొమ్మును స్వాహా చేయబోతున్నారంటూ విమర్శించారు. 
 
దీనికి వైబీ సుబ్బారెడ్డి స్పందించారు. 'ఈ అబ్బాకొడుకులు ఇద్దరూ రాష్ట్రమంతా దోచి పారేశారు. వీళ్లు నా గురించి మాట్లాడుతున్నారు. దేవుడి సొమ్మును ఒక్క పైసా కూడా ముట్టుకోను. అవసరమైతే నా జేబు నుంచి ఖర్చు చేస్తాను. మేము ఏమీ వాళ్లలాగా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు. మా ముఖ్యమంత్రి, మేము పదేళ్లు కష్టపడ్డాం.
 
ప్రజలకు మేలు చేయాలని వచ్చాం. అందుకే ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. దేవుడి సొమ్ము స్వాహా కాదు.. ఒక్క రూపాయి సొమ్మును వృథా కూడా కానివ్వబోం. నా ప్రయాణాలకు కూడా స్వామివారి సొమ్ము ఒక్క రూపాయి కూడా వాడను. అక్కసుతో బాధపడుతున్న ప్రతిపక్షాలన్నింటికి ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నా' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు