సాధారణంగా చిరు ఉద్యోగి కుమారుడు లేదా కుమార్తె కలెక్టర్ అయితే ఎంతో సంతోషిస్తారు. ఈ విషయం ఆ నోటా... ఈ నోటా చేరి విస్తృత ప్రచారం లభిస్తుంది. కానీ, ఇక్కడ విషయమేమిటంటే... ఓ కలెక్టర్ భార్య చిన్నపాటి ఉద్యోగం లభిస్తే అది కూడా చర్చనీయాంశంగానే మారుతుంది. తాజాగా ఓ కలెక్టర్ భర్త మండల కో - ఆప్షన్ సభ్యుడుగా ఎంపికయ్యాడు. ఆ కలెక్టర్ పేరు అయేషా మస్రత్. ప్రస్తుతం వికారాబాద్ కలెక్టర్‌గా ఉన్నారు. ఆమె భర్త కైసర్ అహ్మద్. వృత్తి రాజకీయాలు.
1996లో పంచాయతీ వార్డు సభ్యునిగా రాజకీయ అరంగేట్రం చేసిన కైసర్ 2002లో తిమ్మాపూర్ సహకార సంఘం కో ఆప్షన్ సభ్యునిగా ఎన్నికయ్యారు. గతంలో రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండే కైసర్ ఇటీవల కొన్నాళ్లుగా దూరంగా ఉంటూ వచ్చారు. తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మళ్లీ ఆయనను తెరపైకి తెచ్చి కో ఆప్షన్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.