తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో డాక్టర్ సునీత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల 25 తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆమె సుప్రీంకోర్టులో చాలెంజ్ చేశారు. ఇదే అంశంపై ఆమె అపెక్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును ఈ నెల 25వ తేదీన వెల్లడించనుందని, అందువల్ల తన పిటిషన్పై తక్షణం విచారణ చేపట్టాలంటూ ఆమె సుప్రీంకోర్టును కోరగా, దీనిపై శుక్రవారం సమాధానం చెబుతామని కోర్టు వ్యాఖ్యానించింది.
కాగా, వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఇందులోభాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డితో అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిలను అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించింది. ప్రస్తుతం ఈ ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది. అలాగే, తెలంగాణ హైకోర్టు ఆదేశం మేరకు అవినాష్ రెడ్డి కూడా సీబీఐ విచారణకు బుధవారం నుంచి హాజరవుతున్నారు.
ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ, ముందస్తు బెయిల్ మంజూరుపై ఆ రోజున తీర్పును వెలువరిస్తామని తెలిపింది. ఈ తీర్పును సస్పెండ్ చేయాలంటూ వివేకా కుమార్తె సునీత మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.