మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా హైదరాబాదు నగరంలోని కూకట్పల్లిలో ఓ ఇంటి ఓనర్ తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడనే వేదనతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి మెడికల్ సొసైటీలోని ప్రసన్నకుమార్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో పాలకొల్లుకు చెందిన రామకృష్ణ, సుజాత (28) దంపతులు రెండున్నరేళ్లుగా అద్దెకుంటున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల బాబు, ఏడాది పాప ఉన్నారు.
పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారని తరచూ సుజాతతో ఇంటి ఓనర్ జగడానికి దిగేవాడు. ఇటీవల భర్త లేని సమయంలో కూడా ఇంటి ఓనర్ సుజాత దగ్గర గొడవ చేయడంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సుజాత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తన ఆత్మహత్యకు ఇంటి యజమాని వేధింపులే కారణమని సుజాత సూసైడ్ నోట్లో పేర్కొంది.