దువ్వాడ శ్రీనివాస్‌‍కు జగన్ షాక్ ... టెక్కలి వైకాపా ఇన్‌చార్జ్‌ నుంచి తొలగింపు

ఠాగూర్

శుక్రవారం, 23 ఆగస్టు 2024 (10:14 IST)
భార్యాపిల్లలను వదిలేసి, పరాయి మహిళతో సన్నిహితంగా మెలుగుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నుంచి తొలగించారు. ఆ స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించారు. అలాగే, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గడికోట శ్రీకాంత్ రెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను నియమించారు. 
 
గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీ రచ్చకెక్కిన విషయం తెల్సిందే. దీంతో టెక్కలి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌‌ సమన్వయకర్త పదవి నుంచి జగన్ తప్పించారు. ఆయన స్థానంలో పేరాడ తిలక్‌ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అలాగే, జగన్ పార్టీలో కీలక మార్పులు.. చేర్పులు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి), మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి (పులివెందుల), మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి)లను నియమించారు.
 
ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి ఆళ్ల నాని ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో స్థానంలో కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును నియమించారు. అలానే వైసీపీ అనుబంధ విభాగాల్లోనూ మార్పులు చేసింది. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా జక్కంపూడి రాజా, బీసీ విభాగం అధ్యక్షుడుగా రమేశ్ యాదవ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడుగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా పానుగంటి చైతన్యను పార్టీ నియమించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు