దేవుడు దయదలిస్తే ఏడాదిలో ఎన్నికలు జరగవచ్చునని లేదంటే రెండేళ్ల పాటు గట్టిగా కళ్లు మూసేసుకుంటే.. ఆపై మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో నిర్వహించిన రైతుభరోసా యాత్రలో జగన్ మాట్లాడుతూ.. పోర్టు నిర్మాణం పేరుతో ప్రభు త్వం భూదోపిడీకి పాల్పడుతోందన్నారు. అక్రమార్జన కోసం పారిశ్రామికవేత్తలకు సాగిలపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోందని... ఇక మిగిలింది రెండేళ్లే. ఈ రెండేళ్లు కళ్లు మూసుకుంటే ఆ పాలన ముగుస్తుంది. దేవుడు దయదలిస్తే ఏడాదిలోపే ఎన్నికలు జరగొచ్చు. అప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత వెంట్రుక కూడా కదపడం వారి తరం కాదు. ప్రతిపక్షంలో ఉండగా పోర్టు నిర్మాణానికి 1200 ఎకరాలు సరిపోతాయని చంద్రబాబు చెప్పారు. మచిలీపట్నంలో లక్షా ఐదు వేల ఎకరాల భూముల్ని కాజేయాలని చూస్తున్నారని తెలిపారు.
ఇందులో భాగంగానే తొలుత 33 వేల ఎకరాలకు భూ సమీకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. రైతు సమస్యలను పట్టించుకోకుండా పారిశ్రామికవేత్తలు ఇచ్చే వాటాల కోసం అన్నదాతల పొట్ట కొట్టేందుకు కూడా వెనుకాడట్లేదన్నారు. పోర్టుకు అవసరమైన 4800 ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకుని పరిశ్రమలకు అవసరమైన భూ ములను రైతులు ఇష్టపూర్వకంగా అమ్ముకునే అవకాశం కల్పించాలని జగన్ డిమాండ్ చేశారు.