ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనేక ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో టీడీపీ, వైకాపాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.
ఇదిలావుంటే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 శాతానికి పైగా ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమవ్వగా, మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమొదురు సంఘటనలు జరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తెలుగుదేశం పార్టీ నేతలు, అభ్యర్థులపై దాడులకు దిగుతుండగా, తాజాగా మరో వింత పరిణామం జరిగింది.
కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగగా వారిపై రెండు గ్రూపులు కలిసి దాడికి పాల్పడ్డాయి. దీంతో స్థానిక పోలీసులు జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి అదనపు బలగాలతో అక్కడకు బయలుదేరారు.
శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి గిరిబాబు వృద్ధుల ఓట్లను స్వయంగా వేస్తున్నారు. దీనిపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
అలాగే, విశాఖ జిల్లాలోని రామరాయుడుపాలెంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో అక్కడ వాతావరణం సద్దుమణిగింది.
అలాగే, విజయవాడ పరిధిలోని మొగల్రాజపురం ఓటర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా పోలింగ్ బూత్‌కే తాళం వేసేశారు. ఇక్కడి ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పనిచేయక పోవడంతో ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కాలేదు. 4వ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
ప్రిసైడింగ్ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించినా, సకాలంలో ఈవీఎంలు పోలింగ్ బూత్‌కు చేరలేదు. దీంతో ఈసీ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఓటర్లు, పోలింగ్ బూత్‌కు తాళం వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో అధికారులు తలలు పట్టుకున్నారు.
ఇక్కడి పోలింగ్ కేంద్రానికి కొత్త ఈవీఎం మెషీన్లను పంపే ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్‌ను ప్రారంభిస్తామని, అవసరమైతే సాయంత్రం మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పెంచుతామని అధికారులు వెల్లడించారు. అయినా ఓటర్లు శాంతించలేదు.