కోల్‌కతా వేదికగా కయ్యానికి కాలుదువ్వుతున్న కేకేఆర్

ఆదివారం, 24 మార్చి 2019 (15:07 IST)
ఐపీఎల్ 12వ సీజన్‌లో భాగంగా, కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతో తొలిమ్యాచ్ ఆడనుంది. దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలోని కోల్‌కతా కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధంగా ఉంది. సొంతగడ్డపై వేలాది మంది అభిమానుల మధ్య సత్తాచాటేందుకు పక్కా ప్రణాళికను రచించింది. 
 
వెస్టిండీస్ హార్ట్‌హిట్టర్ అండ్రూ రస్సెల్, క్రిస్ లిన్, బ్రాత్‌వైట్, నితీశ్ రానాతో కోల్‌కతా.. రైజర్స్‌కు సవాలు విసురుతున్నది. బౌలింగ్ పరంగా బలహీనంగా ఉన్న కోల్‌కతా ఏ మేరకు హైదరాబాద్‌ను నిలువరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 
 
గత సీజన్‌లో ఫైనల్లో చెన్నై చేతిలో ఓటమితో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్.. ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో ఉంది. జట్టును ముందుండి నడిపించే కెప్టెన్ విలియమ్సన్‌కు తోడు మార్టిన్ గప్టిల్, బెయిర్‌స్టో, యూసుఫ్ పఠాన్, విజయ్ శంకర్, మనీశ్ పాండే లాంటి వారితో బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నది. 
 
ఎంతటి స్వల్ప లక్ష్యాన్ని అయినా నిలబెట్టుకోవడంలో మిగతా జట్లకంటే ముందుండే రైజర్స్ ఈసారి సత్తాచాటేందుకు తహతహలాడుతున్నది. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్‌కు తోడు కౌల్, సందీప్‌శర్మ, ఖలీల్ అహ్మద్, రషీద్‌ఖాన్, బాసిల్ థంపీ, స్టాన్‌లేక్‌తో కోల్‌కతా ఇక కాచుకో అంటున్నది. 
 
క్రికెట్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో నిషేధం నుంచి ఇంకా బయటపడని వార్నర్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఐపీఎల్‌లో సత్తాచాటడం ద్వారా తనపై పడ్డ మచ్చను తొలిగించుకునేందుకు వార్నర్ వీరోచితంగా పోరాడే అవకాశముంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు