ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రత్యేక హోదా ఇవ్వమని అమిత్ షా కాళ్లు పట్టుకుంటారు. కేసీఆర్ తిట్టిన తిట్లు మరిచిపోయి ఆయన వేసిన బిస్కెట్ల కోసం వెంపర్లాడుతారు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... కేసీఆర్ వస్తే ఇబ్బందిపెడతారని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు చెప్పారు. అలాంటి వ్యక్తి పేరు మీద పార్టీ పెట్టి ఆయన చెప్పిన దారిలో నడవలేకపోతున్నారు. ఇదేనా మీ పులివెందుల పౌరుషం..? అని ప్రశ్నించారు.
ఓదార్పు యాత్ర పేరుతో బుగ్గలు, గెడ్డాలు నిమరడం తప్ప మీకు పౌరుషం లేదా..? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ మీకంటే నాకు బాగా తెలుసు. వారికి మర్యాద ఇస్తాను తప్ప, జగన్మోహన్ రెడ్డిలా ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టుపెట్టను. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేనివాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసీఆర్ గారికి కోపం ఉంటే తాడేపల్లిగూడెంలో అభ్యర్ధిని నిలబెట్టి గెలుపించుకొని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోవాలి తప్ప, జగన్మోహన్ రెడ్డిని అడ్డంపెట్టుకొని ఆంధ్ర రాజకీయాల్లో వేలుపెడతామంటే సహించం అన్నారు.
సైకిల్ స్టాండ్ వేసి తొక్కుకోవాల్సిందే..!
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పేరును ఉచ్చరించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడటం లేదు. ఎక్కడ తగ్గిపోతామోనన్న భయం. నాకు అలాంటి భయాలు లేవు. తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయడం లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 2018 మార్చి 14 జనసేన ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీ అవినీతిపై మాట్లాడి తొక్క తీసిందే జనసేన పార్టీ. టీడీపీ నా దృష్టిలో 2018 లోనే ఓడిపోయింది. సైకిల్ చైన్ తెగిపోయింది. స్టాండ్ వేసి తొక్కుకోవాలే తప్ప దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు.
జన సైనికులను, ఓటర్లను ప్రలోభపెట్టడానికి తెలుగుదేశం నాయకులు కొంతమంది పొత్తులపై తప్పుడు కూతలు కూస్తున్నారు. వారికి ఒకటే చెబుతున్నాను మీ తప్పుడు కూతలు హద్దులు దాటితే ఎంత గట్టిగా మాట్లాడాలో నాకు తెలుసు. తోలు తీసే భాష నాకు వచ్చు జాగ్రత్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో పెడితే జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నారు. టీడీపీని చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి లాక్కున్నారు. దమ్మున్న మగాడిలా పార్టీ పెట్టింది మనమే. ఆంధ్రుల ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పార్టీ పెట్టాను అన్నారు.
ఆడపడుచులకు భరోసాగా...
జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు రూ. 5 వేలు పింఛన్ వచ్చేలా రైతు పెన్షన్ పథకంపై తొలి సంతకం పెడతాను. అలాగే రూ. 8వేలు సాగుసాయం అందిస్తాం. కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా, ఆదాయంతో సంబంధం లేకుండా ఆడపడుచులకు ఉచిత గ్యాస్ అందించే పథకం మీద రెండో సంతకం చేస్తాం. ఏడాదికి ఆరు నుంచి పది సిలిండర్లు ఉచితంగా జనసేన ప్రభుత్వం అందచేస్తుంది. తదుపరి సంతకం రేషన్ బియ్యం, పనికిరాని పామాయిల్‌తో ఇబ్బందులుపడుతున్న మీ కోసం రేషన్‌కి బదులు రూ. 2500 నుంచి రూ. 3500 మహిళల ఖాతాలకి జమ చేసే పథకంపై పెడతాను. ఆడ బిడ్డ ప్రతి ఇంటికి మహాలక్ష్మీ అని, అటువంటి మహాలక్ష్ముల వివాహానికి "మా ఇంటి మహాలక్ష్మీ" పథకం కింద లక్ష రూపాయలు అందిస్తాం, అలాగే "పుట్టింటి సారె" కింద పదివేలనూటపదహార్లు ఇస్తాం.
మాజీ సైనికుల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో 10 ఎకరాల్లో దేశభక్తి ప్రాంగణాలు ఏర్పాటు చేస్తాం. దేశభక్తి పెంపొందించే కార్యక్రమాలు, శారీరక దారుఢ్యం కోసం వ్యాయామశాలలు, యువత వికాసం కోసం యుద్ధ విద్యలు నేరిస్తాం. 3 లక్షల బ్యాక్ లాగ్ పోస్టులను ఆరు నెలల్లో భర్తీ చేస్తాం. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు బలమైన రక్షణ వ్యవస్థ కోసం 25వేల మందితో స్పెషల్ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తాం. పోలీస్ కానిస్టేబుల్స్‌కు ఒక రోజు సెలవుదినంతో పాటు నివాసయోగ్యమైన బహుళ అంతస్తులు నిర్మిస్తాం.
విద్య, వైద్యం ఉచితంగా అందిస్తాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధులు సంవత్సరానికి ఒక్కసారి ఫీజు కట్టే విధానాన్ని తీసుకొస్తాం. ఇంటర్ చదువుతున్న విద్యార్ధులకు ఉచిత ల్యాప్ టాప్ అందిస్తామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చింది. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కొణిదల నాగేంద్రబాబు గారిని అభ్యర్థులుగా నిలిపాం. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి వీరిద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించాల”ని కోరారు.