బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల... టీడీపీ పెండింగ్ అభ్యర్థులపై క్లారిటీ!

వరుణ్

గురువారం, 28 మార్చి 2024 (13:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే పది స్థానాలకు అభ్యర్థలను ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ పెండింగ్ స్థానాల అభ్యర్థులపై ఓ క్లారిటీ వచ్చింది. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 17 లోక్‌సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 10 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ సీట్లలోనూ, జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే, టీడీపీ ఇప్పటివరకు రెండు దఫాలుగా తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. బీజేపీతో పొత్తు అనంతరం మూడు సీట్లు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అరకు అసెంబ్లీ స్థానానికి దొన్ను దొరను, పి.గన్నవరం స్థానానికి మహాసేన రాజేష్, అనపర్తిలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి అభ్యర్థులుగా ప్రకటించారు. 
 
తాజాగా బీజేపీ ప్రకటించిన 10 అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తిలో శివరామకృష్ణ రాజు పేర్లు ఖరారు చేసింది. జనసేన ఇటీవల ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో పి.గన్నవరం స్థానాన్ని గిడ్డి సత్యనారాయణకు ఇచ్చింది. వీటితో తెలుగుదేశం ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
 
విజయనగరం పార్లమెంట్‌తో పాటు చీపురుపల్లి, భీమిలి అసెంబ్లీ స్థానాల్లో ఎవరిని ఎక్కడ నియమించాలన్న పీటముడి వీడలేదు. విజయనగరం లోక్‌సభ సీటు తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. సీనియర్ నేత కళా వెంకట్రావుగానీ, మీసాల గీత, బంగార్రాజు, కిమిడి నాగార్జునలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఒంగోలు లోక్‌సభ స్థానానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరును ఖరారు చేసినట్టు సమాచారం. 
 
కడప పార్లమెంట్ రేసులో రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, జమ్మలమడుగు ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం ఎంపీ స్థానానికి జేసీ పవన్ రెడ్డితో పాటు పోల నాగరాజు, ప్రొఫెసర్ రాజేష్, కంబూరి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. పెండింగులో ఉన్న 8 అసెంబ్లీ స్థానాల్లో పాడేరుకు ఇన్ఛార్జిగా ఉన్న గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పిస్తారా లేక అరకు అభ్యర్థిగా ప్రకటించగా అవకాశం కోల్పోయిన దొన్నుదొరను సీటు ఇస్తారా అన్నది వేచి చూడాలి.
 
అలాగే, చీపురుపల్లి స్థానంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారా లేదా అన్న సందిగ్ధత వీడలేదు. చీపురుపల్లిలో గంటా పోటీ చేయకుంటే సీనియర్ నేత కళా వెంకట్రావ్ లేదా కిమిడి నాగార్జునలలో ఒకరికి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చీపురుపల్లిలో గంటా పోటీ చేస్తే భీమిలి స్థానానికి కళా వెంకట్రావ్ లేదా నెల్లిమర్ల టీడీపీ ఇంఛార్జి బంగార్రాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దర్శి అసెంబ్లీ స్థానానికి సీనియర్ నేత గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు, గొట్టిపాటి నరసయ్య కుమార్తె శ్రీలక్ష్మి పేరు పరిశీలనలో ఉంది. 

వెబ్దునియా పై చదవండి