తన తండ్రి, మీ అందరి అభిమాన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుండెకాయలాంటి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన హంతకుడికి తన అన్న, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ కడప లోక్‌సభ సీటు ఇచ్చాడని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కడపలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించరాదన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తనను కడప లోక్‌సభ అభ్యర్థిగా నిలబెట్టిందని అందువల్ల ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల కోసం 'న్యాయ యాత్ర' పేరుతో ఆమె ప్రచారం ప్రారంభించారు. ఇందులోభాగంగా, బద్వేల్ నియోజకవర్గంలో ఆమె ప్రసంగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ తరపున పది ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన ఆశయం కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. రాష్ట్రం ఈరోజు దీన స్థితిలో ఉంది. ముఖ్యమంత్రి జగన్ పాలనలో విభజన హామీలు ఒక్కటి కూడా సాదించుకోలేదు. కానీ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. కడప స్టీల్ ఫ్యాక్టరీని శంకుస్థాపనల ప్రాజెక్ట్ చేశారు. బీజేపీ దగ్గర జగన్ ఒక బానిసలా మారారు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్రం అభివృద్ది. ఇదే కడప జిల్లా నా పుట్టినిల్లు.ఇక్కడ జమ్మలమడుగు లోనే పుట్టా. ఇవ్వాళ మీ వైఎస్సార్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. మీ దీవెనలతో ఆశీర్వదించండి గెలిపించండి అని పిలుపునిచ్చారు.
పైగా, బాబాయిని చంపిన హంతుడుకి మళ్లీ సీట్ ఇచ్చారు. హంతకులను కాపాడుతున్నారు. ఇది దురదృష్టం, దుర్మార్గం. ఇది అన్యాయం, హంతకులు మళ్లీ చట్టసభలోకి వెళ్లరాదు. అందుకే మీ వైఎస్సార్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. న్యాయం ఒక వైపు, అధికారం ఒక వైపు. అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా? న్యాయం వైపు నిలబడ్డ మీ వైఎస్ షర్మిల కావాలా? ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. హత్యా రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని, కాపాడే జగన్ రెడ్డిని ఇద్దరినీ ఓడించాలి. వైఎస్సార్ బిడ్డను నేను.. వైఎస్సార్ ఎలా ప్రజలకు అందుబాటులో ఉండేవారో.. నేను అలాగే ఉంట.. వైఎస్సార్ లా సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నా అని విజ్ఞప్తి చేశారు.