ఉప ఎన్నికల ప్రచారాన్ని ఆదివారంతో ఆపేయాలి: భన్వర్‌లాల్

ఆదివారం, 10 జూన్ 2012 (15:36 IST)
FILE
ఉప ఎన్నికల సంగ్రామంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి తెరపడనుంది. నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత నిషేధించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. నిషేధాన్ని అతిక్రమించి ఎవరైనా ఇంటింటి ప్రచారం చేస్తే కేసు నమోదుతో పాటు అరెస్టు కూడా చేస్తామని హెచ్చరించారు.

కాగా ఆదివారంతో ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీ వైకాపా, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా అవినీతిని ప్రచారాస్త్రంగా చేసుకుంటే..., కాంగ్రెస్ తెదేపా, వైకాపాలపై దుమ్మెత్తి పోస్తూ ప్రచారాన్ని కొనసాగించింది.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ జైలులో ఉన్నప్పటికీ, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు ఉప ఎన్నికల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైఎస్సార్ మృతితో పాటు జగన్ అరెస్టుకు కాంగ్రెస్ కుట్రే కారణమని, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని విమర్శిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఏది ఏమైనా ఉపఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతోంది. ఇందులో ఏ పార్టీని ఓటర్లు ఆదరిస్తారనే ఫలితాలను బట్టి తెలుసుకోవాల్సిందే..!

వెబ్దునియా పై చదవండి