ఏజెన్సీ ప్రాంతాల్లో "ప్రజా" వైద్య శిబిరాలు: చిరు

మన్యం ప్రాంతాల్లో మంచాన పడిన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రజారాజ్యం పార్టీ నడుంబిగించింది. ప్రాణాంతక వ్యాధులతో అల్లాడుతున్న వారికి కొంతమేరకైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఈ ప్రాంతాల్లో ప్రజా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావించింది.

విశాఖ మన్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి ప్రకటించారు. ఏజెన్సీలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాష్ట్రానికి జబ్బు చేసిందన్న భావన కలుగుతోందన్నారు. మన్యంలోని గిరిపుత్రులు ఆంత్రాక్స్, విషజ్వరాల బారిన పడి మరణిస్తుంటే కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

మన్యం ప్రజల ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దడం కన్నా వైఎస్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని చిరంజీవి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి