"గాలి" బురద వేశారు... కడుక్కోలేక ఛస్తున్నా.. మంత్రి ఏరాసు

శనివారం, 2 జూన్ 2012 (13:32 IST)
FILE
గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ కుంభకోణంలో తన పేరును ప్రస్తావించి తనపై టన్నుల కొద్దీ బురద చల్లేశారని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బురదను కడుక్కోలేక ఛస్తున్నానంటూ వ్యాఖ్యానించారు.

తన తండ్రి నుంచి తన వరకూ ఎప్పట్నుంచో రాజకీయాల్లో ఉన్నామనీ, ఏనాడూ అవినీతి, దౌర్జన్య కార్యకలాపాలకు పాల్పడినట్లు తమపై చిన్న వార్త కూడా లేదని అన్నారు. అటువంటిది గాలి బెయిల్ వ్యవహారంలో తన పేరును ఇరికించి మీడియాలో గోలగోల చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

గాలి బెయిల్ కుంభకోణంలో తన పాత్ర లేదని తేలితే ఇప్పటి వరకూ చల్లిన బురద వల్ల పాడైన తన పేరు ప్రఖ్యాతులను ఎవరు తిరిగి తెస్తారంటూ, ఈ నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారంటూ ప్రశ్నించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఏదో గాలి వార్తలను ప్రసారం చేయడం, బురద పూయటం మామూలైపోయిందని అన్నారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి