తెలంగాణపై హామీ ఇవ్వని మన్మోహన్: కేసీఆర్ నిర్వేదం

మంగళవారం, 4 అక్టోబరు 2011 (08:58 IST)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగామ జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ బృందం మంగళవారం ప్రధానితో సమావేశమైన విషయం తెల్సిందే.

ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని ఎటువంటి హామీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ అంశంపై అందరి వివరాలు సావధానంగా విన్న ప్రధాని సకలజనులసమ్మెను విరమించాలని కోరినట్టు కేసీఆర్ చెప్పారు.

సకల జనుల సమ్మె ప్రజల చేతిలో ఉంది, కేసీఆర్‌కాని జేఏసీ కాని చెపితే సమ్మె విరమించే యోచనలో ప్రజలు, ఉద్యోగులు లేరని, తెలంగాణపై ప్రకటన వస్తేనే సకల జనుల సమ్మె విరమించటం జరుగుతుందని ప్రధానికి ఈ సందర్భంగా తెలిపామన్నారు.

స్వామిగౌడ్‌పై పోలీసుల హత్యాప్రయత్నం, తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత, సమ్మె ప్రభావం గురించి ప్రధానికి వినతిపత్రం ఇచ్చామన్నారు. కాంగ్రెస్ నాయకుల చేతిలో తెలంగాణ ఏర్పాటు ఆధారపడి ఉందని తాము భావిస్తున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి