తెలంగాణ ఇస్తే సంబరం... లేదంటే సమరం : కేటీఆర్ ప్రకటన

సోమవారం, 10 సెప్టెంబరు 2012 (19:30 IST)
File
FILE
తాము అడిగినట్టుగా నిర్ధిష్ట గడువులోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే సంబరాలు చేస్తామని లేదంటే సమరానికి సిద్ధమవుతామని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కే.తారక రామారావు ప్రకటించారు. ఆయన సోమవారం టీఆర్ఎస్ బృందంతో కలిసి కేంద్ర మంత్రి శ్రీప్రకాష్ జైశ్వాల్‌తో సమావేశమయ్యారు.

అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ను పాతరేసి ప్రజలు తెలంగాణను తెచ్చుకుంటారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కాగా, మంత్రి ప్రకాశ్‌కు సమర్పించిన వినతి పత్రంలో సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు నివ్వాలని వారు మంత్రిని కోరారు.

మరో ఎమ్మెల్యే టి హరీష్ రావు మాట్లాడుతూ.. హోమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణపై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. షిండే తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఇప్పుడు తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని హరీష్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి