వైఎస్.జగన్‌ను సుతిమెత్తగా హెచ్చరించిన మన్మోహన్!

గురువారం, 8 సెప్టెంబరు 2011 (15:54 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సుతిమెత్తగా హెచ్చరించినట్టు సమాచారం. తామెవరిమీదా కక్ష సాధించడం లేదనీ, ఏదైనా విచారణ అంటూ జరిగితే ఆ విచారణ సంస్థలకు సహకరించి తమ వాదనలు వినిపించుకోవాలని హితవు పలికినట్టు వినికిడి.

రాష్ట్రంతో పాటు రైతు సమస్యలు, క్రాప్ హాలిడే, ఎరువుల కొరత తదితర సమస్యలపై ఒక వినతి పత్రాన్ని ప్రధాని మన్మోహన్‌కు జగన్ అందజేశారు. అలాగే పనిలోపనిగా కాంగ్రెస్ పార్టీ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే తన ఆస్తులపై సీబీఐ దాడులని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.

దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐని దుర్వినియోగం చేయవద్దని ప్రధానిని జగన్ కోరారు. ఆయన వ్యాఖ్యలకు ప్రధాని ధీటుగా స్పందించినట్లుగా ఢిల్లీ వర్గాల సమాచారం. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏవైనా అభ్యంతరాలు, సమాధానాలు ఉంటే సీబీఐకి చెప్పుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. తాము కక్ష సాధించే వాళ్లం కాదని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి