సీతమ్మలాంటి వదినపై వివేకా పోటీ చేయడమా!?: అంబటి

FILE
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మపై వైఎస్సార్ సోదరుడు వై.ఎస్. వివేకానందరెడ్డి పోటీ చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. సీతలాంటి వదినపై వివేకానందరెడ్డి పోటీ చేయడమా అని ప్రశ్నించారు. వదినపై పోటీకి దిగుతూ వివేకానందరెడ్డి ఆధునిక లక్ష్మణుడిలా వ్యవహరిస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు.

మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కడప గడ్డపై పుట్టి ఉంటే వైఎస్ జగన్మోహన రెడ్డిపై పోటీకి దిగాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ హైకమాండ్ పోటీకి దిగమని చెబుతున్నా డీఎల్ పారిపోవటం సిగ్గుచేటు అని అంబటి ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ ఎలా పనిచేస్తుందో తెలుస్తుందని శనివారం మీడియాతో ప్రతినిధులతో అంబటి వెల్లడించారు.

కాగా, మే నెలలో కడప, పులివెందుల స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్.వివేకానంద రెడ్డి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ఆర్ సతీమణి విజయలక్ష్మి పోటీ చేస్తారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి