కట్టుతప్పిన కరోనా... ఆంధ్రాపై పంజా విసిరిన వైరస్.. కొత్తగా 17 కేసులు

మంగళవారం, 31 మార్చి 2020 (12:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టుతప్పింది. ఈ వైరస్ ఒక్కసారిగా రాష్ట్రంపై పంజావిసిరింది. ఫలితంగా గత 12 గంటల్లో ఏకంగా 17 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 40కి చేరింది. కొత్తగా పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు ఢిల్లీలోని మత ప్రార్థనలకు హాజరైన వారు, మక్కాకు వెళ్లి వచ్చిన వారితో సంబంధం కలిగినవారే కావడం గమనార్హం. దీంతో అధికారుల్లో గుబులు మొదలైంది. 
 
ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకార.. మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపురం, లేపాక్షిలో ఇద్దరికి (వీరిద్దరూ మక్కా వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ అయ్యారు), ప్రకాశం జిల్లాలో ఇద్దరు (ఒకరు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్, మరొకరు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తి), గుంటూరులో ఐదు కేసులు (కరోనా రోగికి దగ్గరగా ఉన్న మహిళ, ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తితో కాంటాక్ట్ పెట్టుకున్న ముగ్గురు, ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తి), కృష్ణా జిల్లాలో ఒకటి (ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తితో కాంటాక్ట్) ఉన్నాయి.
 
వీటితో పాటు ప్రకాశం జిల్లా కందుకూరు, చీరాల, కుంకల మర్రి ప్రాంతాల నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఆరుగురికి, తూర్పు గోదావరి జిల్లాలో మదీనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరందరికి ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, వీరితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని డైరెక్టరేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు