పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలికను సవతితల్లి కిరాతకంగా చంపేసింది. మొదటి భార్యను బాగా చూసుకుంటూ.. రెండో భార్యను నిర్లక్ష్యం చేశాడమే కారణంతోనే సవతి తల్లి నాలుగేళ్ల చిన్నారిని కిరాతకంగా చంపేసింది. దాదాపు పదినెలల తర్వాత కసాయితల్లి ఘాతుకం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన దేవరాజు తిరుమలలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఇతనికి ఇద్దరు భార్యలు. తొలి భార్య ఉలిగమ్మకు ముగ్గురు కుమార్తెలు, రెండో భార్య జ్యోతికి ఒక కుమారుడు ఉన్నారు. రెండో భార్యను ఇంటి వద్దనే ఉంచి మొదటి భార్యతో తిరుమలకు చేరుకున్న దేవరాజు.. అక్కడ పనులను నిర్వర్తిస్తున్నాడు. అయితే గత ఏడాది ఆగస్టు 24న జ్యోతి తిరుమలకు చేరుకుంది. దేవరాజు మొదటి భార్య రెండో కుమార్తె రాధ(4)ను ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి పాత పాపవినాశనం మార్గంలోని అటవీప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ చెట్టుకు కట్టేసి కర్రతో తీవ్రంగా బాదింది. కొనవూపిరితో ఉన్న బాలికను వస్త్రంతో గొంతు నులిమి చంపేసింది.
బాలిక తప్పిపోయిందని అబద్ధం చెప్పింది. భర్తతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిపిన విచారణలో నిందితురాలు జ్యోతినేనని తేలింది. జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించడంతో బండారం బయటపడింది. భర్త దేవరాజుపై తనకున్న కోపమే ఈ హత్యకు కారణమైందని చెప్పింది. తనకు సమీప బంధువులు జయనాయక్, నీరూబాయ్ ప్రోత్సాహం అందించినట్లు వివరించింది.