7 వారాలు కాదు.. 70 వారాల నగలు.. గుట్టలకొద్దీ బంగారం, కట్టల కొద్దీ నోట్లు
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (14:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అవినీతి తిమింగిలం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కింది. ఆయన ఇంట్లో సోదాలు చేస్తుంటే గుట్టలకొద్దీ బంగారం, కట్టలకొద్దీ నోట్లు బయటపడ్డాయి. ఎకరాల కొద్దీ భూములకు సంబంధించిన స్థిరాస్తి పత్రాలు బహిర్గతమయ్యాయి. అలాగే, ఆయన సతీమణి కోసం 7 వారాలు కాదు.. ఏకంగా 70 వారాల నగలను తయారు చేశారు. వీటితో పాటు షిర్డీలో భక్తుల కోసం ఓ లాడ్జి నిర్మించారు. విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో అక్రమాస్తులను గుర్తించారు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే..
విశాఖపట్టణం టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్‌గా ఎన్వీ రఘు పని చేస్తున్నారు. ఈయన పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో సోమవారం ఉదయం ఏకకాలంలో రఘు నివాసంతోపాటు ఆయన కుటుంబీకులు, స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా రఘు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటమేగాక పెద్దఎత్తున ఆస్తులు కలిగి ఉన్నాడని ఏసీబీ అధికారులు గుర్తించారు.
విజయవాడ గన్నవరం మండలం బొమ్ములూరులో 1033 చదరపు అడుగుల భూమి, రఘు పేరిట మంగళగిరి దగ్గర 220 గజాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. అలాగే రఘు భార్య పేరిట గన్నవరంలో 1033 గజాల స్థలం, కృష్ణా జిల్లా వెల్పూరరులో 2.6 ఎకరాల పొలం, కూతురు పేరిట చిత్తూరు జిల్లాలో 428 గజాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. అలాగే, రఘు అక్క పేరుతో విశాఖలో 167 గజాల ఇంటి స్థలం, షిర్డీలో ఇళ్లు, హోటల్ ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. విశాఖ బీచ్ రోడ్డులో 80 లక్షల ఖరీదు చేసే ఫ్లాట్ ఉన్నట్లు కనుగొన్నారు.
అలాగే, పలువురు ఆయనకు బినామీలుగా ఉన్నట్టు గుర్తించారు. అందులో విజయవాడలో జూనియర్ టెక్నికల్ ఇంజనీర్‌గా పని చేస్తున్ననల్లూరి వెంకట శివప్రసాద్ ఒకరు. దీంతో ఆయన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో ఎసీబీ అధికారులు షాక్ తిన్నారు.
ముఖ్యంగా రఘు నివాసంలోని మాసిన బట్టలు, వాషింగ్ మెషీన్ కింద, మంచంకింద, బీరువా సొరుగుల్లో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా బంగారం దొరికింది. సాధారణంగా ఏడు వారాల నగలు కొనుక్కుంటారు. కానీ ఆయన నివాసంలో 70 వారాల నగలు దొరకడం విశేషం. బంగారు విగ్రహాలు, వెండి వస్తువులు, దిమ్మలు, బిస్కెట్ల రూపంలో 50 కేజీల వెండి లభించడం విశేషం.
అలాగే ఆయన నివాసంలో 10 లక్షల రూపాయల నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ముఖ్యంగా డబ్బులు లెక్కించేందుకు ఆయన నివాసంలోనే మనీ కౌంటింగ్ మెషీన్ కూడా ఉండడం విశేషం. ఇవన్నీ చూసి కళ్లు బైర్లు కమ్మిన ఏసీబీ అధికారులు అక్రమాస్తుల లెక్కింపు చేపట్టారు.