జిల్లాల విభజన ప్రక్రియను ఏపీప్రభుత్వం వేగవంతం చేసింది. నాలుగైదు నియోజకవర్గాల్లో జిల్లాల హద్దులు, జిల్లా కేంద్రాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావడంతో వాటిని పరిశీలించి, సమస్యను పరిష్కరించేందుకు తాజాగా మరికొందరు ఉన్నతాధికారులను నియమించింది.
సమస్యలను పరిష్కరించి, సాధ్కమైనంత త్వరగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన నాలుగు కమిటీలకు వీరు అదనం. చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
దీనికి సంబంధించి గతంలో నియోజకవర్గాల పునర్విభజన చేసిన అధికారుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. అప్పట్లో ఎటువంటి సమస్యలూ ఉత్పన్నం కాకపోవడంతో ఇప్పుడు వారితో సంప్రదించాలని భావిస్తున్నారు. కడపజిల్లా రాజంపేట, గుంటూరు జిల్లా బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, విశాఖపట్నంలోని అరకు, విశాఖపట్నం, నెల్లూరు పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాలు ప్రస్తుతం రెండేసి జిల్లాల పరిధిలో ఉన్నాయి.
వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని వాటిని ప్రస్తుతం ఉన్న వాటిల్లో కలపాలా, లేక నూతనంగా సమీపంలో ఉండే జిల్లాల్లో కలపాలా అన్న ఆంశంపై అధికారులు చర్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనాభా వివరాల సేకరణ, సరిహద్దుల విభజన వంటి సమస్యలూ రాకుండా ఇతర సాంకేతిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో జిల్లాలను ప్రకటించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.
కృష్ణాజిల్లాలో నూజివీడు, కైకలూరు ఏలూరు జిల్లాలో కలిపినా ఆ జిల్లా పరిధిలో వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని అంచనా వేశారు. అలాగే శృంగవరపుకోటను విశాఖలో కలిపేయొచ్చని నిర్ణయించినట్లు తెలిసింది. రాజంపేట, బాపట్లకు సంబంధించి జిల్లా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు.
వీటితోపాటు నూతనంగా ఏర్పాటయ్యే జిల్లాల్లో జనాభా సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం కమిటీకి సూచించినట్లు తెలిసింది. వీటితోపాటు సాంకేతిక, న్యాయపరమైన సమస్యలూ రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ సమస్యలు పరిష్కరించి తుది నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది.