తెలుగు సినీ నటుడు శివాజీ చాలా రోజుల తర్వాత వార్తలకెక్కారు. ఆయన టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను సోమవారం కలిశారు. హైదరాబాద్ నగరంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత లోకేశ్ నాయకత్వ పటిమ, దార్శనికతపై శివాజీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నాయకత్వం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.
ఈ భేటీకి సంబంధించిన వివరాలను శివాజీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "నారా లోకేశ్‌ను ఆయన నివాసంలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దార్శనికత, నాయకత్వ లక్షణాలు నిజంగా స్ఫూర్తిదాయకం. మా మధ్య జరిగిన అర్థవంతమైన చర్చను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని శివాజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ను శివాజీ ది వాయిస్ ఆఫ్ పీపుల్ (ప్రజా గొంతుక)గా అభివర్ణించారు.
ఈ సందర్భంగా తాను ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని లోకేశ్‌కు బహుకరించినట్టు శివాజీ వెల్లడించారు. గత కొంతకాలంగా రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తున్న శివాజీ... ఇపుడు నేరుగా నారా లోకేశ్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన టీడీపీలో చేరుతారా అనే సరికొత్త చర్చకు ఈ భేటీ నాది పలికింది.