అజయ్‌ కల్లం వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం

శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (05:46 IST)
ముఖ్యమంత్రి సలహాదారు రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కల్లం వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అన్ని విషయాలు తెలిసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇలా మాట్లాడ్డమేంటని పలువురు మండిపడుతున్నారు.
 
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఏర్పాటు చేసిన 'మూడు రాజధానులు ముద్దు… అమరావతి ఒద్దు' అనే బహిరంగ సభలో అజయ్‌ కల్లం చేసిన ప్రసంగాన్ని హైకోర్టు జడ్జి ఒకరు తప్పుబట్టడం జరిగింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ, ఇతర ముఖ్యులు కానీ బినామీల పేరిట కొనుగోలు చేస్తే ఆదారాలతో, సీలు వేసిన కవర్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేయాలే తప్ప అజయ్‌ కల్లం ఆ విధమైన ప్రసంగాలు చేయటం నేరమని న్యాయకోవిదులు చెబుతున్నారు.

ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ రాజకీయ బహిరంగ వేదికలపై మాట్లాడటమే తప్పు. అంతే కాకుండా సుప్రీంకోర్టు జడ్జిల చేతుల్లో అమరావతి భూములున్నాయి అని ఆ సభలో అజయ్‌ కల్లం ప్రసంగించటంపై సుమోటోగా కేసును నమోదు కూడా చేయవచ్చు అంటున్నారు.
 
సుప్రీం కోర్టు చీఫ్‌జడ్జికు అజయ్‌ కల్లంపై కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తులు చెబుతున్నారు. ఈ విమర్శలు, ఆరోపణల పర్వంతో అజయ్‌ కల్లం అధ్యాయం ముగిసి పోవటం ఖాయమంటున్నారు అధికారులు.

ఆధారాలు లేకుండా… రాజకీయ, బహిరంగ వేదికలపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులను వివాదంలోకి తీసుకు రావటం కోర్టు ధిక్కారం అవుతోంది. అపార అధికార అనుభవం ఉన్న అజయ్‌ కల్లం ఈ విషయంలో తప్పటడుగులు వేసి తన అధికార జీవితానికి మాయని మచ్చను కొని తెచ్చుకున్నారని అంటున్నారు.

ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల వలె పత్రికా సమావేశాలు నిర్వహించి ప్రతి పక్ష నాయకుడిపై విమర్శలు, ఆరోపణలు చేసిన ఘనత అజయ్‌ కల్లంకే దక్కింది. తనపై అజయ్‌ కల్లం చేసిన విమర్శలు, ఆరోపణలకు చంద్రబాబు స్పందించలేదు.
 
కానీ సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై ఆధారాలు లేని విమర్శలు, ఆరోపణలను బహిరంగ వేదికలపై చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి? సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేయిస్తారా..? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పందించి పత్రికల్లో వచ్చిన కధనాలతో పాటు వీడియోలు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు సమర్పిస్తే పరిస్థితి ఏమిటి..?అనేది వేచి చూడాల్సిందే.

"మాకు తెలిసినంత వరకు అజయ్‌ కల్లం చాలా మంచివారు. పది మందికి సహాయం చేయాలని తపన పడే మనస్తత్వం ఆయనది. చంద్రబాబు కూడా ఆయనను గుర్తించి కీలక పదవులతో పాటు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి పదవిని కూడా ఇచ్చారు. అలాంటి అజయ్‌ కల్లం ఈ విధంగా మాట్లాడతారని మేము అనుకోలేదు. అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదు" అంటున్నారు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు.
 
ముఖ్యమంత్రి ప్రాపకం కోసమా..!!
ముఖ్యమంత్రి కార్యాలయంలో వివిధ హోదాలలో పని చేస్తున్న అధికారులలో ప్రవీణ్‌ ప్రకాష్‌నే జగన్‌ ఎక్కువగా నమ్మి, ఆయనకే కీలక ప్రాధాన్యత బాధ్యతలు అప్పజెబుతున్నారట.

పిపి సిఎంవోకు రాకముందు ముఖ్యమంత్రి జగన్‌ తన సలహాలు, సూచనలు మాత్రమే విని పాటించేవారని, ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తనను పట్టించుకోకుండా.. పరోక్షంగా అవమానించటమే కాకుండా తాను పర్యవేక్షించే జిఎడి మరియు ఇంధనం శాఖ బాధ్యతలనుండి తప్పించి బాధపెట్టారని, వీటన్నింటిని అదిగమించి మళ్లీ గత వైభవాన్ని ఏ విధంగా పొందాలి అని ముఖ్యమంత్రి సలహాదారు, రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కల్లం రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఏర్పాటు చేసిన సభలో జగన్‌ను మళ్లీ ప్రసన్నం చేసుకునేందుకే ఆ విధమైన ప్రసంగాన్ని చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
ముఖ్యమంత్రి జగన్‌ బలహీనతలు, బలాలు అజయ్‌ కల్లంకు తెలుసు. మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడాలి… అమరావతి రాజధానికి అనుకూలంగా ఉద్యమిస్తున్న రైతులపై విమర్శలు, ఆరోపణలు చేయాలి.

అదే విధంగా చంద్రబాబుతో సహా మిగతా.. నాయకులపై విమర్శలు, ఆరోపణలు చేస్తే.. ముఖ్యమంత్రి జగన్‌ సంతృప్తి చెందుతారని ‘దూరా’లోచనతో ఆ విధమైన ప్రసంగాలను అక్కడ చేసినట్టు స్పష్టమవుతోందని సిఎంవోలో పనిచేస్తున్న ఇతర అధికారులు చెప్పుకుంటున్నట్లు తెలిసింది.

లేకుంటే.. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇంతవరకు సుప్రీంకోర్టు జడ్జిలు కొందరు భారీ ఎత్తున భూములను బినామిల పేరిట కొనుగోలు చేశారని ఇంతకు ముందు ఎవరూ విమర్శలు, ఆరోపణలు చేయలేదు. ఆవిధమైన చర్చ కూడా జరగలేదు.
 
కానీ అజయ్‌ కల్లం రెడ్డి ఆ విధమైన విమర్శలు, ఆరోపణలు చేయటం సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు జడ్జిలలో కొందరిపై అలాంటి విమర్శలు, ఆరోపణలు చేస్తే జగన్‌కు ఆనందం కలుగుతుందేమో అన్న ఆశతో అజయ్‌కల్లం విమర్శ చేసి ఉంటారేమో అని కొందరు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు