ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తుండడంతో విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది. సెప్టెంబర్ మూడో వారానికి ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం నిర్ణయం తీసుకున్నారని విద్యుత్‌శాఖ మంత్రి ఆదిమలుపు సురేశ్ ప్రకటించారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జూలై 31 వరకు అన్ని కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. జూలై నెలాఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవకూడదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఐతే డిగ్రీ పరీక్షలను మాత్రం ఖచ్చితంగా నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించుకోవచ్చని తెలిపింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు వస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోలేని పరిస్థితి నెలకొంది.ఏపీలో ఇప్పటి వరకు 31,103 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి.