ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అవినీతి.. సీఎం జగన్ ఇంటి వద్ద ఫ్లెక్సీ కలకలం

ఆదివారం, 18 జులై 2021 (16:26 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసం ఉంది. ఇక్కడే సీఎం క్యాంపు కార్యాలయం కూడా ఉంది. అయితే, సీఎం నివాసం సమీపంలో ఏర్పాటుచేసిన ఓ ఫ్లెక్సీ ఇపుడు కలకలం రేపింది. 
 
ఏపీ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో అవినీతి జరిగిందంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. స్వార్థపరుల వల్ల అమరారెడ్డి నగర్ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, ఇళ్లు ఇవ్వాలని సీఎం ఆదేశించిన కూడా అధికారులు పట్టించుకోలేదని అందులో ఆరోపించారు. 
 
నిజమైన నిర్వాసితులకు అన్యాయం జరిగిందని.. తమ అనుకూల వర్గం వారికే ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆరోపిస్తూ ఫ్లెక్సీ పెట్టారు. ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అవినీతి జరిగినట్లు నిర్వాసిత బాధితులు ఆరోపించారు. స్వార్థపరుల వల్ల అమరారెడ్డి నగర్ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ముఖ్యంగా, రెండు చర్చిలను నేలకులుస్తున్నారని కనీసం చర్చిల కైనా స్థలం కేటాయించాలని పాస్టర్లు కోరుతున్నారు. బాధితులకు న్యాయం చేయాలని సీఎం, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌, నాయకులకు విజ్ఞప్తి చేశారు. 
 
సీఎం భద్రత చర్యల్లో భాగంగా రహదారి విస్తరణ కోసం తాడేపల్లిలోని అమరారెడ్డి నగర్ వాసుల వాసులు గృహాలను ఖాళీచేయించారు. వీరికి పరిహారం కింద ఆత్మకూరు సమీపంలో ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఈ అంశంపై చాలా రోజులుగా బాధితులు ఆందోళనలు కొనసాగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు