పోలవరంపై పవన్ దృష్టి మళ్లింది.. డంపింగ్ యార్డు కోసం భూములు లాగేస్తుంటే?

బుధవారం, 18 జనవరి 2017 (16:36 IST)
చేనేత కార్మికుల దీనస్థితిపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చలించిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు పవన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ప్రత్యేక హోదా, కిడ్నీ బాధితులు, రైతు సమస్యలు వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న పవన్ కల్యాణ్ కన్ను పోలవరం ప్రాజెక్టుపై పడింది. 
 
ఇందులో భాగంగా పవన్ కల్యాణ్‌ను పోలవరం ప్రాజక్ట్ బాధితులు కలిశారు. డంపింగ్ యార్డు నిర్మాణం పేరిట తమ నుంచి 203 ఎకరాల భూమిని అధికారులు బలవంతంగా సేకరిస్తున్నారని పోలవరం మండలంలోని మూలలంక గ్రామస్థులు పవన్ కల్యాణ్‌కు తెలియజేశారు. కోర్టు తీర్పులను చూపించినా అధికారులు బలవంతంగా తమ వద్ద భూముల్ని లాగేసుకుంటున్నారని వారు ఆరోపించారు.  
 
డంపింగ్ యార్డ్ కోసం దగ్గర్లోని బీడు భూములు చూపించినా.. అధికారులు మాత్రం పంట భూముల్నే టార్గెట్ చేస్తున్నారని పవన్ కల్యాణ్‌కు పోలవరం బాధితులు విన్నవించుకున్నారు. ఇందుకు సానుకూలంగా పవన్ స్పందించారు. ఇందుకు అన్నివిధాలా సహకరిస్తానని పవన్ బాధితులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి