ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి వాతావరణ కేంద్రం కీలక వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అప్రమత్తం చేసింది.
మరోవైపు ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ తుపాన్ల ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఆదివారం పలు జిల్లాల్లో వానలు కురిశాయని పేర్కొంది. మున్ముందు అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, ఏలూరు, అనంతపురం, అనకాపల్లి, కర్నూలుతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసినట్టు పేర్కొంది. రాజమండ్రిలో అత్యధికంగా 53 మి.మీ. వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో మాత్రం వేడి వాతావరణం నమోదైంది. కావలిలో ఆదివారం గరిష్ఠంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, కావలి, నెల్లూరు, కడప, అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, తుని, కాకినాడతో పాటు పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి.