మా సర్కారు.. మా ఇష్టం... మూడు కాకుంటే 33 పెట్టుకుంటాం...

శుక్రవారం, 20 డిశెంబరు 2019 (09:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాష్ట్రాలు ఉండొచ్చు అన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన 29 గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ప్రకటనకు వ్యతిరేకంగా గురువారం ఒక రోజు బంద్ కూడా పాటించారు. 
 
ఈ నేపథ్యంలో జగన్ మంత్రివర్గంలోని సీనియర్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తామన్నారు. రాజధానిలో భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికల ముందే జగన్‌ చెప్పారని గుర్తుచేశారు. అమరావతిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆందోళనలు చేస్తున్నారని, నిరసన కార్యక్రమాల్లో ఒక్క రైతు కూడా లేరని చెప్పారు. పైగా, విశాఖలో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయన్నారు.
 
అదేసమయంలో విశాఖలో భూములు కొన్నామని అనడం సరైంది కాదన్నారు. సచివాలయం తాత్కాలికమని చంద్రబాబే చెప్పారన్నారు. మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామని తెలిపారు. రాజధానులకు కేంద్రం అనుమతులు, నిధులు అవసరం లేదని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. మార్చిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందుకోసం జనవరిలో నోటిఫికేషన్ వెల్లడికావొచ్చని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు