భారతీయ జనతా పార్టీపై వైకాపా నేత, మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ దేశంలో పెద్ద పార్టీయే కావొచ్చు కానీ రాష్ట్రంలో మాత్రం తుస్సేనని చెప్పారు. ఆత్మకూరు అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ బరిలో లేదని అందుకే బీజేపీ నేతలు రోడ్లపై కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు మాట్లాడుతూ, బీజేపీ నేతలు ప్రచారం కోసమే తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పైగా, టీడీపీ బరిలో లేదు కాబట్టే బీజేపీ నేతలు కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
ప్రచారం పొందాలన్న ఉబలాటంతోనే తనను ఏదో ఒకటి అంటున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ప్రజాధనంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ వచ్చేలా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వైకాపా కార్యకర్తలు రప్పించాలని ఆయన పిలుపునిచ్చారు.