కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజా వేదిక భవనాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తాను నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి దిగిన తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అవసరాలకు తగ్గ ఇంటిని వెతికే పనిలో బిజీగా మారిపోయారు. చివరికి వెలగపూడిలో 90 ఏళ్ల పాతదైన ఇంటిని టీడీపీ నేతలు ఎంపిక చేశారు.
ఈ పెంకుటిల్లును చంద్రబాబుకు ఇచ్చేందుకు వెలగపూడి మాజీ సర్పంచ్ శాంతమ్మ సంతోషంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈ ఇంటిని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పరిశీలించారు. మండువా లోగిలి, పచ్చటి చెట్లతో ఈ ఇల్లు బాగుందని ఆయన కితాబిచ్చారు. అయితే ఈ ఇంటిలోకి చంద్రబాబు ఎప్పుడు మారతారు? ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్‌ను ఖాళీ చేస్తారా? అన్న విషయమై క్లారిటీ రావాల్సివుంది.