మండలంలోని చొక్కాండ్లపల్లె పొలాల్లో ఉదయం రైతులకు ఈ ఏనుగు కనిపించింది. సమాచారం తెలుసుకున్న పరిసర గ్రామాల్లోని ప్రజలు ఏనుగును చూడటానికి తరలివచ్చారు. దీంతో ఏనుగు జనాన్ని చూసి బెదిరిపోయి పంట పొలాల్లో పరుగులు తీసింది. జనం కూడా ఏనుగు వెంటపడి తరిమారు. బాణసంచా పేలుస్తూ కర్ణాటక రాష్ట్రం కారంగి అడవివైపు తరిమారు.
దీంతో పురాండ్ల పల్లె, ఎర్రప్పల్లె, మూగవాడి, ఎం.గొల్లపల్లె, మినికి, రామసముద్రం పొలాల్లో తిరుగుతూ అలసిపోయిన ఏనుగు సాయంత్రం ఊలపాడు చెరువులోని పొదల్లో గంటపాటు తలదాచుకుంది. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి టపాకాయలు పేలుస్తూ దానిని కర్ణాటకలోని కారంగి అడవివైపు తరిమేందుకు చర్యలు చేపట్టారు.
ఏనుగును చూసేందుకు అప్పటికే జనం వందలాది మంది తరలివచ్చారు. జనం పెట్టే కేకలకు ఏనుగు బెదిరిపోవడంతో దాన్ని అదుపుచేయలేక నానా తంటాలు పడ్డారు. ఫారెస్ట్ అధికారులు జనాన్ని హెచ్చరిస్తున్నా వినకుండా వారు ఏనుగు వెంటపడడంతో ఊహించని విధంగా ఏనుగు ఒక్కసారిగా తిరగబడింది. దీంతో జనం పరుగులు తీయగా భూసానికురప్పల్లెకు చెందిన వెంకటరామన్న(60) కింద పడిపోయాడు. ఏనుగు అతన్ని తొండంతో పైకిలేపి భూమికేసి కొట్టి కాళ్లతో తొక్కి చంపేసింది. ఈ సంఘటనను చూసిన జనం భయభ్రాంతులై పరుగులు తీశారు.