ఆనందయ్య మందును రేపటి నుంచి పునఃప్రారంభించాలి: సోమిరెడ్డి
మంగళవారం, 25 మే 2021 (23:06 IST)
ఆనందయ్య మందు పంపిణీని రేపటి నుంచి పున:ప్రారంభించకుంటే ఈ ప్రభుత్వాన్ని, పాలకులను ప్రజలే కాదు.. దేవుడు కూడా క్షమించబోరు అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో ఆనందయ్య మందుకు డిమాండ్ ఏర్పడింది... దాన్ని చూసి ఓర్వలేకపోవడం క్షమార్హం కాదన్నారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో తెలుగుదేశం పార్టీ బృందం క్షేత్రస్థాయి పర్యటన చేసింది.
ఆనందయ్య నివాసంతో పాటు ఆయన ఆయుర్వేదం మందు తయారీ, పంపిణీ ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్ శివప్రసాద్, మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఏకొల్లు కోదండయ్య, తెలుగు యువత అధ్యక్షుడు ఈఫూరు మునిరెడ్డి తదితరులు సందర్శించారు.
ఆనందయ్య సతీమణి ఇంద్రావతితో పాటు ఆయుర్వేద మందు తయారీ, పంపిణీలో ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తున్న వలంటీర్లు, ప్రత్యేకంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారులను సత్కరించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
బీద రవిచంద్ర కామెంట్స్
ఇప్పటివరకు పోర్టు ద్వారా వ్యాపారపరంగా క్రిష్ణపట్నం ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు ఆనందయ్య కరోనాను తగ్గించేందుకు ఆవిష్కరించిన ఆయుర్వేదం మందు ద్వారా ప్రపంచమంతా మరోసారి క్రిష్ణపట్నంవైపు చూస్తోంది. వారం రోజులుగా ఆనందయ్య మందు పంపిణీని నిలిపేయడం బాధాకరం. ఆయుర్వేదం మందుపై పరీక్షలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.
ఆనందయ్య ఆయుర్వేదం మందుపై ఎలాంటి అభ్యంతరాలు, ఆక్షేపణలు లేవని టీటీడీ ఆయుర్వేద వైద్యులు, ఆయుష్ కమిషనర్ రాములు ప్రకటించారు..అనుమతులు మాత్రం రావల్సివుందన్నారు. ప్రభుత్వాలు, ఆస్పత్రులు ఎంత చేసినా కరోనాపై ప్రజల్లో ఏర్పడిన భయాన్ని తొలగించలేకపోతున్నారు..సరైన వైద్యం అందించలేకపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆనందయ్య ఆయుర్వేద మందు ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం నింపింది. ఎందుకో గానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక వారం సమయం వృథా చేసింది. మా పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు, ప్రజలను కాపాడుకోవడంలో భాగంగా ప్రభుత్వానికి సూచనలు చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఆనందయ్య మందు పంపిణీని వెంటనే పున:ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
కోటంరెడ్డి కామెంట్స్
ఆనందయ్య మందు కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కరోనా బారిన పడతామనే ఆందోళన ఎక్కువ మందిలో ఉంది..అటువంటి వారందరికీ ఆనందయ్య మందు ఒక భరోసా ఇస్తోంది. అనుమతులు ఇవ్వడానికి మొదట రెండు రోజులన్నారు.. తర్వాత నాలుగు రోజులున్నారు..ఇప్పుడు వారమంటున్నారు.
ప్రజలు చనిపోయిన తర్వాత పర్మిషన్లు ఇస్తారా.. త్వరగా అనుమతులు ఇవ్వాలి..ఆనందయ్య ఆధ్వర్యంలోనే పంపిణీ జరగాలి.. ఆనందయ్య మందుపై ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది..మేం మౌనంగా ఉన్నా ప్రజలు గమ్ముగా ఉండే ప్రసక్తే లేదు. ప్రజల్లో తిరుగుబాటు రాకముందే కళ్లు తెరిచి ఆనందయ్య మందును పంపిణీని పున:ప్రారంభించాలి.
డాక్టర్ జెడ్ శివప్రసాద్ కామెంట్స్
ఆనందయ్య ఆయుర్వేదం మందు భధ్రత, శాస్త్రీయత, నాణ్యత, సాంకేతికతను వీలైనంత త్వరగా తేల్చాలి. మందుపై నిర్ణయాన్ని ఇలా గాలిలో పెట్టి చర్చలు పెట్టడం తగదు. ఆయుర్వేదం మన భారతీయ సంప్రదాయ వైద్యం, మన పూర్వీకులు ప్రపంచానికి అందించిన వైద్యం. మందు తయారుచేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం... ఆనందయ్యను తప్పక గౌరవించాలి.
ప్రపంచంలో అనేక రకాల వైద్యాలున్నాయి.వాటి ద్వారా ప్రజలకు కరోనా నుంచి విముక్తి కల్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన ఊళ్లో మన ఆనందయ్య చేస్తున్న మందుపై ఇంత చర్చ, జాప్యం, కన్ఫ్యూజన్ తగదు..వెంటనే నిర్ణయం తీసుకోవాలి..