ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

ఠాగూర్

గురువారం, 19 సెప్టెంబరు 2024 (17:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ కొత్త పాలసీకి ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏపీలో క్వార్టర్ మద్యం సీసా ధరను రూ.99గా నిర్ణయించారు. అలాగే, నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకునిరానుంది. రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం (340 దుకాణాలు) కేటాయించాలనే కమిటీ సిఫార్సుకు సమ్మతి తెలిపింది. రాష్ట్రంలో 12 ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తిరుపతిలో మాత్రం ప్రీమియర్ దుకాణానికి అనుమతివ్వలేదు. 
 
ఈ కొత్త మద్యం విధానంలో అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానుంది. ఇది రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి విలేకర్లకు వెల్లడించారు.
 
'కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా మద్యం దుకాణాల సంఖ్యను నిర్ణయించాం. లాటరీ విధానంలో వీటిని కేటాయిస్తాం. రిజర్వుడు దుకాణాలకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేస్తాం. అన్ రిజర్వుడు దుకాణాలకు ప్రతిపాదించే లైసెన్స్ ఫీజుల్లో 50 శాతమే రిజర్వుడు దుకాణాలకు ఉంటుంది. 
 
లైసెన్స్ ఫీజు నాలుగు శ్లాబులో రూ.50 నుంచి 85 లక్షల వరకు ఉంటుంది. ప్రాఫిట్ 20 శాతం మార్జిన్. ప్రీమియం దుకాణాలకు లైసెన్స్ కాలపరిమితి ఐదేళ్లు. ఫీజు రూ.కోటి. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి చర్చకు రాలేదు. ప్రైవేటు వారు వారిని తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు' అని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు