జగన్ సర్కారు కీలక నిర్ణయం.. చంద్రబాబు అక్రమాల వెలికితీతకు సిట్

శనివారం, 22 ఫిబ్రవరి 2020 (13:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ బృందానికి ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్‌ రెడ్డి సారథ్యం వహిస్తారు. ఈయన ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
గతంలో మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికలోని అంశాలపై సిట్‌ విచారణ చేపట్టనుంది. సీఆర్‌డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పు, అవకతవకలు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, బినామీ లావాదేవీల ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి సారించనుంది. సీఆర్‌డీఏతో పాటు ఇతర ప్రాజెక్టుల్లోని అక్రమాల ఆరోపణలపైనా సిట్‌ విచారణ చేపట్టనుంది. 
 
ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులుగా ఐపీఎస్‌ అధికారులు అట్టాడ బాబూజీ, వెంకట అప్పలనాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, జయరామ్‌రాజు, విజయ్‌ భాస్కర్‌, గిరిధర్‌, కెనడీ, శ్రీనివాసన్‌, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డిలను నియమించింది. సిట్‌కు ప్రభుత్వం విస్తృతాధికారాలు కట్టబెట్టింది. ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం సిట్‌కు ఉందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు