రూ.4 వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా.. ఏపీలో మద్యం ధరల బాదుడు

సోమవారం, 4 మే 2020 (09:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మందు బాబులకు తేరుకోలని షాకిచ్చారు. మద్యం ధరలను విపరీతంగా పెంచేశారు. ఒక యేడాదికి రూ.4 వేల కోట్ల మేరకు ఆదాయమే లక్ష్యంగా మద్యం ధరలను పెంచేశారు. ఈ పెంచిన ధరలు సోమవారం అంటే మే 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పట్టీని చూసిన మందుబాబులకు గొంతులోకి చుక్క పడకుండానే నిషా వచ్చింది. 
 
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో వుంది. ఈ మే 17వ తేదీతో ముగియనుంది. అయితే, సోమవారం నుంచి గ్రీన్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు కేంద్రం అనుమతిచ్చింది. అలాగే, ఆంక్షలతో మద్యం ధరల విక్రయానికి కూడా ఓకే  చెప్పింది. 
 
దీన్ని ఏపీ సర్కారు తనకు అనుకూలంగా మార్చుకుంది. సోమవారం నుంచి మద్యం విక్రయాలకు తెరతీసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య కంటైన్మెంట్ల జోన్ల బయట మాత్రమే మద్యం విక్రయించుకోవచ్చని స్పష్టం చేసిన ప్రభుత్వం, మద్యం ఉత్పత్తుల ధరలను భారీగా పెంచింది. దీంతో రాష్ట్రానికి ఏటా రూ.4 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.
 
మద్యం అమ్మకాలను తగ్గించడమే తమ లక్ష్యమని అంటున్న ఏపీ సర్కారు, లైట్ బీర్ ధరను రూ.20, స్ట్రాంగ్ బీర్ ధరను రూ.10 మేరకు పెంచింది. క్వార్టర్ బాటిల్‌పై రూ.20, హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80, ఫారిన్ లిక్కర్ బాటిల్‌పై రూ.150 చొప్పున ధరలను పెంచారు.
 
అయితే, ఇప్పుడు స్టాక్ ఉన్న మద్యాన్ని పాత ధరలకే విక్రయించాలని, కొత్త ఎమ్మార్పీ ధరలు ముద్రించినవి మార్కెట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే కొత్త ధరలు అమలులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు