నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. సభకు రానున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్

ఠాగూర్

సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (09:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభ ఉపన్యాసంతో సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సభ వాయిదాపడుతుంది. రెండో రోజున మంగళవారం నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు ప్రసంగిస్తారు. 
 
కాగా, ఈ సమావేశాలు 20 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. సమావేశాల నేపథ్యంలో శాసనసభ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గంలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పీఏలకు కూడా అనుమతి లేదని స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులను కలిసేవారు అసెంబ్లీకి కాకుండా, నేరుగా సీఎంవోకు వెళ్లాలని ఆయన సూచించారు. 
 
ఇదిలావుంటే ఎలాంటి సమాచారం, కారణం లేకుండా అసెంబ్లీకి రాకుండే ఉంటే అనర్హత వేటు పడుతుందన్న భయంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీకి చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరుకావాలని నిర్ణయించారు. ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఉంది. ఈ నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యేలు సభకు రావాలని నిర్ణయించినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు