ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఠాగూర్

ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (18:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్  పనుల్లో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్‌లోని 14వ కిలోమీటరు వద్ద పైకప్పు కూలిపోవడంతో 8 మంది టన్నెల్‌లోనే చిక్కుకునిపోయారు. వారిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని ప్రాణాలతో కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీరికోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం రంగంలోకిదిగాయి. అయితే, ఆదివారం సాయంత్రానికి కూడా వారి ఆచూకీ లేదా వారు ఎలా ఉన్నారో తెలియడం లేదు. ముఖ్యంగా, వారంతా సజీవంగానే ఉన్నారా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కాగా, టన్నెల్‌లో 14వ కిలోమీటరు వద్ద 100 మీటర్ల మేర భారీగా బురద ఉన్నట్టు గుర్తించారు. టన్నెల్‌లో బురదను దాటి వెళ్లేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఫిషింగ్ బోటు, టైర్లు, చెక్కబల్లలు వేసి వాటి మీదుగా బురదను దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 100 మీటర్ల మేర ఉన్న బురదను దాటి వెళితేనే ప్రమాద స్థలికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు సొరంగ మార్గంలో 13.5 కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీమ్‌లు వెళ్లగలిగాయి. మరో అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీరు, అడ్డంకింగా మారడంతో అందులో చిక్కున్న ఎనిమిది మంది కార్మికులపై ఆందోళన నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు