ముఖ్యమంత్రుల ఫోన్ ట్యాపింగ్..? ఆ ఐపీఎస్ సస్పెన్షన్ వెనుక..?

సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (12:26 IST)
దేశ భద్రతకు వాడాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయ ప్రత్యర్ధుల కోసం వాడారా..? అసలు ఇజ్రాయిల్ పరికరాలు ఎందుకుకొన్నారు..? ఎవరి కోసం కొన్నారు..? రికార్డులలో చేయించే రాజకీయులు అస్సలు దొరకరు. దొరికిది ఉద్యోగులే. అందులో తాజాగా సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి ఒకరు. ఆయన చేసింది ఏ స్థాయి నేరం. ఆయనపై ఏ స్థాయిలో విచారణ జరగనున్నది..? ఆ విచారణ పరిధి ఎంత..? ఇవన్నీ కాలం తేల్చాల్సిన సందిగ్ధ ప్రశ్నలు. ఏ ముసుగులో ఎవరేం చెప్పినా.. నిజం ఎప్పుడూ నిప్పే. దానికి చెదలు పట్టవు. 
 
అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిజ్ఞానాన్ని వాటేసుకొని.. వాడేసుకొని.. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ కే పరిమితమా..? నాటి ప్రభుత్వాలు.. ప్రత్యర్ధుల ఫోన్లు ట్యాప్ చేశాయా..? అందులో నాటి ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, నేటి ముఖ్యమంత్రి జగన్, పవన్ కల్యాణ్.సహా ఇతర జాతీయ, రాష్ట్ర ముఖ్యుల ఫోన్లు పక్కాగా ఎవరు విన్నారు..? అది ఎలా సాధ్యం అయింది.? దేశ భద్రత దృష్ట్యా ఈ కథనం సంక్షిప్తంగా... 'ఆదాబ్ హైదరాబాద్' అందిస్తున్న సంచలన పరిశోధన కథనం.
 
అసలేం జరిగింది: 
చంద్రబాబు హయాంలో ఐపీఎస్ అధికారి ఏబీ.వెంకటేశ్వరరావు కొత్త కొత్త టెక్నికల్ పరికరాలు కొని ఏం చేసినట్టు..?! ఆయన ఏరకమైన పరికరాలు కొన్నాడు. నిజానికి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, వారి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నదే…! ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ విభాగం ఆ నివేదికలను ముఖ్యమంత్రులకు ఇవ్వడమూ పరిపాటే…! అందుకని 'ఫోన్ల ట్యాపింగు' అనేది పెద్ద సీరియస్ నేరారోపణగా తీసుకోలేకపోయినా…. ఇదీ ఇప్పుడు చర్చలోకి వస్తున్న అంశం. ప్రభుత్వం ఏమీ చెప్పదు కానీ, సోషల్ మీడియా మాత్రం జోరుగా దర్యాప్తు సాగిస్తున్నది. నిజానిజాల్ని జగన్ ప్రభుత్వం తనే విచారిస్తుందా..? లేక ఏకంగా తనపై 'రాజద్రోహం' ఆరోపణల్ని చేస్తున్నది కాబట్టి కేంద్రానికి అప్పగిస్తుందా..? లేక తాజాగా ఆదాయానికి మించిన ఆస్తులు అనే అంశం తెరపైకి వస్తున్నది కాబట్టి ఏసీబీ విచారణకు ఆదేశిస్తుందా,..? చూడాలి.
 
మేడికొండ వంశీ ఎవరు..? 
ఈ వెంకటేశ్వరరావుకు 'మేడికొండ వంశీ' అనే హ్యాకర్ ద్వారా కేసీయార్, పవన్ కల్యాణ్, జగన్ తదితర టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ, జనసేన నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించాడా..? ఇది కొత్త ఆరోపణ. ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసిన పరికరాలను ఇంకా దేనికోసం వాడారు..? ఇది మరో ప్రశ్న. ఈ పరికరాల కొనుగోళ్లలోనే వెంకటేశ్వరరావు తన 'కొడుకు కంపెనీ' పేరిట చేతివాటం ప్రదర్శించాడని, సదరు ఇజ్రాయిల్ కంపెనీకి మన ప్రొటోకాల్స్ లీక్ చేశాడని కదా ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ. ఇంతకీ ఆయన ఏం కొన్నాడు..?
 
2017లో ఏం జరిగింది: 
ఇజ్రాయిల్ కంపెనీ నుంచి కొన్నవి 'స్కై స్టార్ 180 ఎరోస్టాట్, ఆర్బిటర్-3, (పేరు లేని ఏరియల్ వ్యవస్థ)… పోలీసు ఆధునీకరణ కింద యంటీ-నక్సల్స్ ఆపరేషన్స్ పేరిట..  జీఓ ఆర్.టి.నెం.957, తేది: 07-12-2017 ప్రకారం జరిగిన కొనుగోళ్లు ఇవి. వీటి ద్వారా దాదాపు 1000 అడుగుల ఎత్తు వరకూ బెలూన్ టైపు పరికరాల్ని పంపించి, మనకు కావల్సిన ప్రాంతాల్లో నిఘా వేయడం… వీటిని నక్సలైట్ల మీద గాకుండా జగన్, ఇతర వైసీపీ నాయకుల కదలికలపైనే కాదు, సొంత ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్య నాయకులపై నిఘాకు వాడారని ఇప్పుడు తాజా విమర్శ. ఇవన్నీ జగన్ ప్రభుత్వం ఎలా ప్రూవ్ చేస్తుంది..? తను కూడా అలాగే చేయాలని అనుకుంటే ఇక దీని గురించి ప్రస్తావన తీసుకురాకపోవచ్చు. 
 
ఫోన్ ట్యాపింగ్ ఎలా  చేస్తారు..?: 
సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు మూడు నుంచి నాలుగు వర్క్ స్టేషన్లు, డెస్క్ టాప్ మానిటర్లు, హెడ్ ఫోన్లతో కూడిన ఒక గది ఉంటే చాలు. ఈ గది మొత్తాన్ని సీసీ టీవీ కెమెరా నిఘాలో ఉంచుతారు. ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసిన పరికరానికి ఈ నెట్ వర్క్ అనుసంధానం చేస్తారు.
 
వీళ్ళకే అధికారం: 
మన దేశంలో సీబీఐ, రా, ఐబీ, ఈడీ, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఆదాయపన్ను విభాగం, రాష్ట్ర పోలీసు విభాగం అధికారులు మాత్రమే వీటి ద్వారా ట్యాపింగ్‌ చేయడానికి అధికారాన్ని కలిగి ఉన్నారు.
 
సెల్ టవర్ల ద్వారా సాధ్యమే..: 
ఇటీవల కాలంలో సెల్ టవర్లు ఎక్కువైన దృష్ట్యా టవర్ మీద కూడా ట్యాపింగ్ పరికరాన్ని ఏర్పాటు చేసి కాల్స్‌ను ట్యాపింగ్ చేసే వెసులుబాటు ఉంది. దీని ద్వారా ఆ టవర్ ప్రాంతంలో ఉన్న అన్ని నెంబర్లనూ ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది.
 
మూడేళ్ల జైలుశిక్ష..: 
ఈ మిషన్లను అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు. ఇలాంటి మిషన్లను ఉపయోగించి ట్యాప్‌ చేసినట్లు బయటపడితే.. టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 26(బి) ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశముంది.
 
ఎంకన్నా.. నిన్ను ఎవరు విచారించాలే..?
సీనియర్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావుపై ఆరోపణల్ని ఎవరు విచారించాలి..? కొత్తగా తవ్వితే బయటకు వచ్చిన విషయాలు ఏమిటంటే..? మీం చెబుతున్నామని మీరేం ఫీల్ కావద్దు. జస్ట్ కొంచెం ముందు చెబుతున్నాం అంతే..!
 
1) 2015లో గన్నవరం ప్రాంతంలో జరిగిన జంట హత్యల విషయంలో మాయం అయిన బంగారం లెక్క. (అప్పుడు బెజవాడ కమీషనర్ ఈయనే… అయినా మనకెందుకు..? విచారణ చేసే వాళ్ళు ఆ విషయాలు చూసుకుంటారు. 'ఉయ్' ఆర్ ఆల్ జస్ట్ ఐటెం ఫ్రెండ్స్)
 
2) తెలంగాణలోని పసుపుల గ్రామంలో 57.19 ఎకరాలు, చిట్యాలలో 64.20 ఎకరాలు. ఇవి రెండు మక్త్యాల మండలంలోని జడ్చర్లలో 53.07 ఎకరాలు. వీటి పేరిట కేసీయార్ 'రైతుబంధు' స్కీమ్ కింద డబ్బులు కూడా జమ చేశాడట.! ఎంత కక్కుర్తి.. ఏదైనా అంటే 'ఫీల్' అవుతారు. అందుకే ఏం అనం.
 
3) కొడుకు పేరు మీద 'ఫాస్ట్ ట్రాక్స్' అనే ఒక లారీ ట్రొన్స్ ఫోర్ట్ కంపెనీ… జస్ట్ ఇది ఓలా కాబ్స్ లాగా పనిచేస్తుంది.
 
అంటే వీటిని జగన్ ప్రభుత్వమే తన ఏసీబీతో విచారణ జరిపిస్తుందా..? ఒక డీజీ స్థాయి అధికారిపై ఏసీబీ అధికారులు స్వేచ్ఛగా దర్యాప్తు చేయగలరా..? మరి జగన్ ఏం చేయాలి..? ఏం చేస్తాడు..? ఏం చేయగలడు? 'వీక్'గా లేని వెండితెరపై వీక్షిద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు