ఏపీలో ఆరో తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభం.. మంత్రి రజనీ వెల్లడి

ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (14:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ అనే పథకాన్ని ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి రజినీ తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం, లింగంగుంట్ల గ్రామంలో సీఎం జగన్ పర్యటనపై శనివారం ఆమె సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఫ్యామిలీ డాక్టర్ విధానం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంలో ఇప్పటికే అనేకమందికి నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. 
 
ప్రతి రెండు వేల మంది జనాభా ఉన్న గ్రామాన్ని ఒక విలేజ్ క్లినిక్‌గా ప్రకటించి, ఆ గ్రామంలో ఈ వైద్య విధానాన్ని అమలుచేస్తామని తెలిపారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ఈ ఇద్దరు వైద్యుల్లో ఒకరు పీహెచ్‌సీలోనే ఉంటూ వైద్య సేవలు అందిస్తారని, మరొకరు 104 వాహనంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటి వద్దే వైద్యం అందిస్తారని చెప్పారు. 
 
ఓపీ సేవలతో పాటు గర్భిణీలు, నవజాత శిశువులు, బాలింతలు, రక్తహీనతతో పాటు వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ వైద్య సేవలు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఒక గ్రామంలో నెలలో రెండుసార్లు సందర్శించి ఈ వైద్య సేవలను అందిస్తారని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కూడా అవరమైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు