సోషల్ మీడియాలో ఎదురయ్యే నెగెటివిటీపై టాలీవుడ్ హీరో నాని స్పందించారు. మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమంలో మాట్లాడారు. నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ఇది. ఓటీటీ జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. తనకు నచ్చిన సినిమాకు జాతీయ అవార్డు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గతంలో నాని పోస్టు పెట్టగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని జగపతి బాబు ప్రస్తావించగా నాని స్పందించారు.
'ఒకప్పుడు మంచి, చెడు వేర్వేరు. తప్పు చేస్తే విమర్శిస్తారు, మంచి పని చేస్తే ప్రశంసిస్తారని బాల్యంలో నేర్చుకున్నాం. కానీ, ఇప్పుడు మంచైనా, చెడైనా ట్రోల్స్ వస్తున్నాయి. ఏదైనా విషయాన్ని నేరుగా చెప్పినా, ఎంత స్మార్ట్‌గా చెప్పినా విమర్శలు తప్పట్లేదు. మీరు పెట్టిన పోస్టుని అర్థం చేసుకున్న వారికన్నా అపార్థం చేసుకునే వారే ఎక్కువగా ఉంటున్నారు. నా ఉద్దేశం అది కాదు అంటూ అందరికీ వివరణ ఇవ్వలేం కదా. అలాగని మనసులో మాట బయట పెట్టకుండా కూడా ఉండలేం. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు.. ఒకవేళ సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉండిపోవడం నరకమైపోతోంది. కామెంట్లను పట్టించుకోకపోవడమే మనం చేయగలిగింది. మనకు కరెక్ట్ అనిపించింది మనం చేయాలి. ఆరోజు నేను మాట్లాడి ఉండాల్సింది. మాట్లాడలేకపోయా అనే బాధ పదేళ్ల తర్వాత ఉండకూడదు' అని పేర్కొన్నారు.
ఒకే రోజు విడుదలయ్యే సినిమాల గురించి మాట్లాడుతూ.. మావాడి సినిమా ఆడాలి. వేరే వాడిది ఆడకూడదు అని అభిమానులు, మన సినిమా హిట్ కావాలి. మరో సినిమా హిట్ కాకూడదు అని ఇండస్ట్రీ వాళ్లు అంటుంటారు. నేను నా సినిమాలతోపాటు విడుదలయ్యే చిత్రాలూ విజయం అందుకోవాలని కోరుకుంటా. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం అని పేర్కొన్నారు. 2023లో ప్రకటించిన జాతీయ అవార్డుల జాబితాలో జై భీమ్ సినిమా లేకపోవడంతో బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్టు చేశారు నాని. టాలీవుడ్‌కు వచ్చిన అవార్డుల గురించి ప్రస్తావించకుండా కోలీవుడ్ మూవీ గురించి పోస్టు పెట్టడంతో అప్పట్లో విమర్శలొచ్చాయి.