డిగ్రీ విద్యార్థినిని గొంతు నులిమి హత్య చేసిన యువకుడు.. ఎక్కడ.. ఎందుకు..?

బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (22:36 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థిని తోటి విద్యార్థి గొంతు నులిమి పాశవికంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష (19) నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 
 
బొల్లాపల్లి మండలం పమిడిపాడు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి సైతం అదే కాలేజీలో చదువుతున్నాడు. వీరిద్దరూ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా యువతి మరో యువకుడితో చనువుగా ఉంటోందని విష్ణువర్ధన్‌ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. 
 
బుధవారం అనూషను మాట్లాడుకుందాం అని పిలిచి ఆమెతో గొడవకు దిగాడు. పాలపాడు రోడ్డు గోవిందపురం మేజర్ కాలువ వద్ద యువతిని గొంతు నులిమి దారుణంగా హత్య చేసి కాలువలోకి పడేశాడు. అనంతరం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.  
 
నరసరావు పేటలో విద్యార్థిని హత్య ఘటనపై సీఎం జగన్‌ ఆరా తీస్తున్నారు. సీఎంవో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు