దీంతో.. ఇప్పటివరకూ ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి ఇక నుంచి శాసన రాజధానిగా మారనుంది. ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు మారనున్నాయి. వికేంద్రీకరణ బిల్లును 3 వారాల క్రితం జగన్ సర్కార్ గవర్నర్‌కు పంపింది. ఇప్పుడు.. గవర్నర్ ఆమోదించడంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయినట్టయింది.
కాగా, జనవరి 20వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనమండలిలో ఈ బిల్లులు తొలుత పాస్ కాలేదు. ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. దీంతో, జూన్ 16వ తేదీన రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసి, ఆ తర్వాత, శాసన మండలికి పంపింది.
అనంతరం నెల రోజుల తర్వాత బిల్లు ఆటోమేటిక్ పాస్ అయినట్టుగా భావించి, గవర్నర్ ఆమోదానికి పంపారు. ఈ నేపథ్యంలో, ఈ బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో ఏపీకి మూడు రాజధానులు ఏర్పడనున్నాయి.