వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ సర్కారు తేరుకోలేని షాకిచ్చింది. జగన్‌కు చెందిన సరస్వతీ పవర్ ప్లాంట్ కోసం కేటాయించిన వందల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఈ భూముల్లో అసైన్డ్, ప్రభుత్వ భూములు ఉన్నట్టు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.
పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ ప్లాంట్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాలను అసైన్డ్ భూములుగా ప్రభుత్వం గుర్తించింది. సరస్వతీ పవర్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నట్టు గుర్తించిన మాచవరం తహసీల్దార్ క్షమారాణి ఈ విషయమై కలెక్టరకు నివేదిక ఇచ్చారు.
ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ దస్తావేజులను రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ అనుమతితో బుధవారం మొత్తం 24.85 ఎకరాల అసైన్డ్ భూములను రద్దు చేసినట్టు క్షమారాణి వెల్లడించారు.
పల్నాడు జిల్లాలోని చెన్నయపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలను సరస్వతీ పవర్ ప్లాంట్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయినప్పటికీ ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆ భూముల్లో అటవీ, అసైన్డ్ భూములు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ఆరోపణలు వచ్చినట్టుగా వీటిలో అటవీ భూములు లేవని అధికారులు గుర్తించారు. అయితే, అదేసమయంలో 24.84 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్న విషయం బయటపడింది. ఈ క్రమంలో తహసీల్దార్ నివేదిక అనంతరం కలెక్టర్ ఆదేశాలతో పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ భూముల రిజిస్ట్రేషనన్ను రద్దు చేశారు.